
నేరాలకు పాల్పడే వ్యక్తులకు కులం, మతం ఉండదని, వారిని కేవలం నేరస్థులుగానే చూడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కుల రాజకీయాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాకినాడలో నిర్వహించిన “మన ఊరు – మాటా మంతి” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, నేరాల నియంత్రణపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
క్రిమినల్ గ్యాంగ్‌ల సహాయంతో ప్రభుత్వాలను నడపాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. నేరస్థులు అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, తప్పు చేసిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని బెదిరించడం, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం, ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తామని హెచ్చరించడం వంటి చర్యలను సహించబోమని పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎవరూ రక్షించలేరని, నేరం చేసిన వారికి మళ్లీ అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిజమైన బాధితుల రక్షణ కోసం సమర్థిస్తామని, అయితే తప్పుడు కేసులు పెట్టడం వల్ల అసలైన బాధితులకు నష్టం జరుగుతుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై నిజమైన గౌరవం ఉన్నవారు చట్టాలను దుర్వినియోగం చేయరని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా చట్టం దుర్వినియోగంపై పలు సందర్భాల్లో మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
2017లో సుగాలీ ప్రీతి అనుమానాస్పద మరణం కేసులో న్యాయం కోసం భారీ ఉద్యమం చేపట్టామని, అయితే గత ప్రభుత్వ హయాంలో కీలక సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా చట్టపరంగా సాక్ష్యాధారాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
కాకినాడ చిన్నస్వామి నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల పట్టాలను బలవంతంగా లాక్కోవడం, దివ్యాంగులు, వితంతువులు, క్యాన్సర్ బాధితుల హక్కులను హరించడం వంటి ఘటనలను ఆయన ప్రస్తావించారు. అలాగే స్థానిక వ్యాపార కుటుంబాల ఆస్తులను ఆక్రమించడంతో వారు నగరాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితిని వివరించారు.
కుల రాజకీయాలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక నేరస్థుడి చర్యలకు మొత్తం కులాన్ని బాధ్యులను చేయడం సరికాదని, నేరాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని చట్టం తన పని చేయాలని సూచించారు. ప్రజలు, యువత కులాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు.
వ్యవస్థలను బలపరచడమే తన లక్ష్యమని, చట్టం ముందు అందరూ సమానమేనని, తన పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.