
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరో రెండు కొత్త ఎయిమ్స్‌లు (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేయాలని జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి వైద్య సంస్థగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పీ. నడ్డాకు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఐదు కోట్ల జనాభాకు ఒకే ఒక్క ఎయిమ్స్ మాత్రమే ఉండటం సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గుండెజబ్బులు, క్యాన్సర్, న్యూరో వైద్యం, అవయవ మార్పిడి, అత్యవసర ట్రామా కేర్ వంటి ప్రత్యేక వైద్య సేవల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త ఎయిమ్స్‌ల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ రాష్ట్రాలకు ఒకటికి మించి ఎయిమ్స్‌లు మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కూ మంజూరు చేయాలని కోరారు.
మంగళగిరి ఎయిమ్స్‌ను సమగ్ర క్యాన్సర్ కేంద్రం, అవయవ మార్పిడి సంస్థ, న్యూరోసైన్సెస్ ఇన్స్టిట్యూట్, ఆధునిక గుండె చికిత్స కేంద్రాలతో విస్తరించడంతో పాటు పడకల సంఖ్య, బోధనా సిబ్బందిని పెంచాలని వినతిపత్రంలో సూచించారు.
రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొంటూ, ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని లింగమనేని రమేశ్ కోరారు.