
జనసేన నాయకులు మాదాసు నరసింహ మహిళా పోలీసు అధికారి ప్రవళికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారిణిని చుట్టుముట్టి అభ్యంతరకరంగా ప్రవర్తించడం, దాడికి యత్నించడం రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో జరిగినట్లుగా కనిపిస్తోందని అన్నారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకత్వం, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా పోలీసు అధికారిపై జరిగిన దాడిని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పట్ల వైసీపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.
అలాగే, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పరామర్శించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తూ, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని, గతంలో వచ్చిన 11 స్థానాలు కూడా ఆ పార్టీకి దక్కవని మాదాసు నరసింహ వ్యాఖ్యానించారు.