
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నియామకాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో కాపు-బలిజ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సంఘం గ్రేటర్ రాయలసీమ విభాగం అధ్యక్షుడు పూల పాండు రంగయ్య నాయుడు పేర్కొన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన కాపు-బలిజ బంధువుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర జనాభాలో కాపు-బలిజ వర్గానికి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ, నామినేటెడ్ పదవులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నియామకాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. ప్రస్తుతం 13 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాలు పూర్తయ్యాయని, అందులో ఒక్క విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి మాత్రమే కాపు-బలిజ వర్గానికి చెందిన ప్రొఫెసర్‌కు అవకాశం లభించిందని తెలిపారు.
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏపీ క్లస్టర్ విశ్వవిద్యాలయం, ఏపీ ఉర్దూ విశ్వవిద్యాలయాలకు ఇంకా వీసీల నియామకాలు జరగాల్సి ఉన్నాయని గుర్తుచేశారు. ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మినహాయించి మిగిలిన పోస్టుల్లో కనీసం రెండు వీసీ పదవులను కాపు-బలిజ వర్గానికి చెందిన ప్రొఫెసర్లకు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 17 వీసీ పోస్టుల్లో మూడు పదవులు కాపు-బలిజ వర్గానికి దక్కాయని, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశించినా నిరాశ ఎదురైందన్నారు. కాపు-బలిజ మేధావులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నియామకం ఇప్పటికీ అమలు కాకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన బలిజ మహిళ ప్రమాణ స్వీకారానికి సహకరించాలని సంబంధిత ప్రజాప్రతినిధులకు సూచించారు.
రానున్న రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి కీలకమని, కార్యకర్తలకు అండగా నిలుస్తూ సమర్థ పాలన అందిస్తేనే కూటమికి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని పాండు రంగయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే గ్రేటర్ రాయలసీమలో బలిజ వర్గం ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.