సెప్టెంబర్ 15 నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభం

అగ్రిగోల్డ్ బాధితులకు నిర్దిష్ట కాలపరిమితిలో న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, అగ్రిగోల్డ్ సమస్యపై కేబినెట్ సబ్‌కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సెప్టెంబర్ 15లోగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెలలోనే ఆస్తుల వేలం విధివిధానాలను ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 11న ప్రధాన కార్యదర్శితో సమావేశమై అంతర్రాష్ట్ర అంశాలు, న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌కు చెందిన 23,430 ఎకరాల స్థిరాస్తులు గుర్తించామని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20,450 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. సీఐడీ పరిశీలన అనంతరం 14,304 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించగా, ప్రస్తుతం 6,330 ఎకరాల భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అగ్రిగోల్డ్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.3,944 కోట్లు సమీకరించినట్లు పేర్కొన్నారు. మొత్తం 18.57 లక్షల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి డిపాజిట్లు సేకరించినప్పటికీ, కేవలం 5.76 లక్షల ప్లాట్లకే ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

అగ్రిగోల్డ్ వ్యవహారంలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ప్రతి దశను బాధితులు తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్, డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎర్రచందనం, టేకు తోటల పేరుతో సేకరించిన డిపాజిట్ల అంశంపై కూడా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.

అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం ఆగస్టు 15 నాటికి ప్రత్యేక కోర్టు భవనం సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఏజెంట్ల వద్ద ఉన్న సుమారు రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను తిరిగి స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా అక్కడే బాండ్లు అప్పగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.