ఉప్పాడ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి భారీ ఊతం.. రూ.10 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కాకినాడలో నిర్వహించిన “మన ఊరు మాటా-మంతి” కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు రూపొందించిన 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తూ, అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ డిజైన్ లోపాల కారణంగా అలల తాకిడికి దెబ్బతిన్న 29 పడవల యజమానులకు మొత్తం రూ.75,52,800 విలువైన పరిహార చెక్కులను అందజేశారు. ఇందులో 16 పడవలు పూర్తిగా, 13 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

హార్బర్‌లోని డిజైన్ లోపాలను శాశ్వతంగా సరిచేసేందుకు అదనంగా రూ.80 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో హార్బర్‌ను పునర్నిర్మించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యు.కొత్తపల్లి మండలానికి చెందిన 100 మంది మత్స్యకారులకు రూ.1.42 కోట్ల విలువైన 10 హెచ్‌పీ, 20 హెచ్‌పీ సామర్థ్యం గల అధునాతన బోటు ఇంజన్లను పంపిణీ చేశారు. ఇంజన్ల కొనుగోలులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుల వాటాగా ఉండగా, మిగిలిన 50 శాతం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గ నిధుల నుంచి భరించాలని అధికారులను ఆదేశించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఉప్పాడ మత్స్యకార కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేందుకు ప్రముఖ ఫార్మా సంస్థలు రూ.9.05 కోట్లకు పైగా ఆర్థిక సహాయం ప్రకటించాయి. దివీస్ ల్యాబొరేటరీస్ రూ.4.50 కోట్లు, అరబిందో ఫార్మా రూ.4.55 కోట్లు అందించనున్నాయి. ఈ నిధులతో సముద్రపు నాచు సాగు, సీవీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కృత్రిమ రీఫ్‌లు, చేప పిల్లల నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అదేవిధంగా డియాజియో గ్రూప్–టార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యు.కొత్తపల్లి మండలంలోని 50 అంగన్‌వాడీ కేంద్రాలను సుమారు రూ.2 కోట్ల వ్యయంతో మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. రెండేళ్లపాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే మరో 110 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి అపోలో సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు లింగమనేని రమేష్, సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ విప్‌లు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.