

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన “మన ఊరు మాటా-మంతి” కార్యక్రమంలో రైతులతో కలిసి ఈ నిధులను విడుదల చేశారు.
ఈ పథకం ద్వారా కాకినాడ జిల్లాలోని 2.73 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.99.58 కోట్ల పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమైంది. రైతుల సాగు వ్యయాలకు తోడ్పాటుగా ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రధాని కిసాన్ పథకం కింద రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.5,000 అందిస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 అందుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అదనంగా రూ.14,000 జోడించి మొత్తం ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తోంది.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది రైతులకు అండగా నిలవడం కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతులతో కలిసి నిధులను విడుదల చేయడం తనకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు లింగమనేని రమేష్, వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.