ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి దుర్గేష్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అవకాశాలు తీసుకురానుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఏర్పాట్లను మంత్రి దుర్గేష్ సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన బొబ్బిలి వీణలు, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట చిత్రాలు, కలంకారీ కళాకృతులు, శ్రీశైలం, తిరుమల, లేపాక్షి నంది తదితర ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలను ఆయన ప్రశంసించారు.

‘ఫ్లైయింగ్ ఫిష్’ ఆకృతిలో రూపొందించిన టెర్మినల్ డిజైన్, ఆధునిక లైటింగ్, ఏరో బ్రిడ్జ్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, విశాలమైన రన్‌వేలు, డిజిటల్ చెక్-ఇన్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, ఈ-గేట్లు, విశాల పార్కింగ్ వంటి అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలు ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని కలిగిస్తాయని మంత్రి తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌తో పాటు భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. విమానాశ్రయం ప్రారంభంతో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతాయని, విశాఖ ఎకనామిక్ రీజియన్‌కు ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.

ప్రధాని పర్యటన సందర్భంగా నిర్వహించే ‘థింసా’ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఆగస్టు 1న జరిగే ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.