
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. తాజాగా ఎన్నికైన 12 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.
అయితే ఈ వార్తలను అన్నాడీఎంకే నాయకత్వం పూర్తిగా ఖండించింది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడం వెనుక ఉద్దేశ్యం వారిని ఇతర పార్టీల ప్రలోభాల నుంచి కాపాడుకోవడమేనని స్పష్టం చేసింది. టీవీకే తమ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని భావించి ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
సీనియర్ నేత కేపీ మునుసామి మాట్లాడుతూ.. “టీవీకేకు అన్నాడీఎంకే ఎలాంటి మద్దతు ఇవ్వదు. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఆమోదంతోనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను” అని తెలిపారు.
ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు మద్దతు అంశంపై ఈపీఎస్ మొదట మౌనం పాటించడంతోనే గందరగోళం నెలకొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన స్పందన లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈపీఎస్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించడంతో ఎమ్మెల్యేలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుకు ఇంకా 10 స్థానాల దూరంలో ఉంది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
అయితే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే మద్దతును కోరడంపై విజయ్ ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో బీజేపీ ప్రభావం ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాను సమర్పించిన తర్వాతే ముందుకు రావాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.