నెట్ జీరో హెల్దీ క్యాంపస్’తో పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం

మార్కాపురం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో ‘నెట్ జీరో హెల్దీ క్యాంపస్–వి బి జి రామ్ జి హార్టికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్–2026-27’ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ‘అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్’లో భాగంగా నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో కలెక్టర్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి వనరుల విచక్షణారహిత వినియోగం వల్ల పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కాలానుగుణంగా వర్షాలు కురవని పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని సుమారు పది పాఠశాలలు, వసతి గృహాల్లో ‘నెట్ జీరో హెల్దీ క్యాంపస్’ కార్యక్రమాన్ని హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సహకారంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

క్యాంపస్‌లో నీరు, వ్యర్థాల పునర్వినియోగం, సేంద్రీయ సాగు పద్ధతుల ప్రోత్సాహం, సోలార్ విద్యుత్ వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, అల్ట్రా హై డెన్సిటీ విధానంలో మొక్కల పెంపకం వంటి అంశాలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్, పాఠశాలల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, గ్రామస్తులు, విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సువార్త, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.