
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, గృహం వంటి మౌలిక అవసరాల్లో విద్య అత్యంత కీలకమైనదని అన్నారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రతి పేద విద్యార్థికి చదువుకునే అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో గిరిజన కాలనీల్లో అంగన్వాడి పిల్లలకు స్టేషనరీ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డ పాఠశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని, అందుకు తమవంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని హామీ ఇచ్చారు.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం ద్వారా కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా పేదల విద్య, వైద్యం కోసం ముందుకు వచ్చి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు గండు ఆనంద్, మహేష్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.