
విజయవాడ : విజయవాడలో ఘనంగా నిర్వహించిన “MSME గ్రోత్ సమ్మిట్ 2026” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డి. బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు కూడా సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.200 కోట్ల నిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు అనుకూలమైన ‘సన్‌రైజ్ స్టేట్’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 175 MSME పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 100 పార్కులకు భూముల కేటాయింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.
బ్యాంకుల ద్వారా రూ.2.11 లక్షల కోట్ల రుణాలు అందించడంతో పాటు, ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా మరో రూ.5 వేల కోట్ల రుణాల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పీఎం ముద్రా, స్టాండప్ ఇండియా, విశ్వకర్మ పథకాల ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ, కొత్తగా పరిశ్రమలు ప్రారంభించే వారికి రూ.1 కోటి వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
“ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్యంతో MSME శాఖ వేగంగా ముందుకు సాగుతోందని సభలో నాయకులు తెలిపారు.