బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సువేందు అధికారి హెచ్చరిక

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అక్రమ వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేలోపు స్వచ్ఛందంగా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశంపై మాట్లాడుతూ, కొత్త చట్టం అవసరం లేకుండానే ప్రస్తుతం అమల్లో ఉన్న విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారు తక్షణమే వెళ్లిపోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ పౌరులను తిరిగి స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంటూ, భారత్‌లో అక్రమంగా నివసించే వారికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశ వనరులను అక్రమ వలసదారుల కోసం వినియోగించలేమని వ్యాఖ్యానించారు.

అక్రమ వలసదారులను జైళ్లకు పంపవద్దని తాను పోలీసులకు సూచించినట్లు చెబుతూ, వారు స్వచ్ఛందంగా వెనుదిరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉండగా, బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరుగు ప్రయాణం ప్రారంభించినట్లు సమాచారం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకింపూర్ సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో వారు గుమిగూడినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.