
కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై కొందరు ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వారిని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాస రాజు ఆధ్వర్యంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు రాజీ రెడ్డి, కాస రాజు మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. విధుల పేరుతో మహిళా ఉద్యోగిని ఫోన్‌ల ద్వారా వేధించడం, బెదిరించడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఒత్తిడి తీసుకురావడం, ఉద్యోగం తొలగిస్తామని బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలతో మహిళా ఉద్యోగులతో పాటు కార్యాలయానికి వచ్చే మహిళల్లోనూ భయాందోళనలు నెలకొంటాయని అన్నారు. గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వేధింపులు మరింత పెరిగాయని పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
దీనిపై స్పందించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, ఈ అంశాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కలెక్టర్‌తో చర్చించి బాధ్యులపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జనసేన నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర్ల శ్రీనివాస్, అన్వేష్ రెడ్డి, పొన్నాల తిరుపతి, మహాదేవ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.