ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిని సమీక్షించారు.

రెండో విడతలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 50 ఏళ్లలోపు చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది.

వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజు కొనసాగింపునకు అనుమతి మంజూరు చేసింది.

పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన కేబినెట్, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికీ అనుమతి ఇచ్చింది.

విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై కూడా చర్చించింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎల్‌నినో పరిస్థితులపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, పశువులకు మేత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.