
విజయవాడ: విజయవాడ నగరంలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాలపై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నగరంలోని 64 డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను నాయకత్వంలో విజయవాడలో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. పార్టీ విస్తరణకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో పార్టీ బలోపేతం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహం, సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసరావు, వంశీకృష్ణ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, ప్రజా మద్దతు ఉన్న ప్రతి డివిజన్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.