
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం అన్న క్యాంటీన్, ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
“పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అనే నినాదంతో ప్రతి కుటుంబం తమ పిల్లలతో కలిసి కనీసం ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పెరుగుతున్న కాలుష్య ప్రభావం నుంచి భావితరాలను కాపాడేందుకు చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీడ్ బాల్స్‌ను తయారు చేసి పరిసర ప్రాంతాల్లో చల్లడం ద్వారా రాబోయే వర్షాకాలంలో అవి మొలకెత్తి వృక్షాలుగా మారి పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు.
“జై ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర” నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, బోలా మాధవి, పల్లాల శ్రీను, షాహుల్, వెంకటాచలం మండల కార్యదర్శి సంధూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు