
మోపిదేవి : ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడే సహజ రక్షకుడని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోపిదేవిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అనంత అరణ్య’ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
రూ.3.30 లక్షల వ్యయంతో 15 సెంట్ల స్థలంలో 915 ఔషధ, పండ్ల మరియు నీడనిచ్చే మొక్కలను నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను ఆరోగ్యవంతమైన, పచ్చని ప్రాంగణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అనంత అరణ్య కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇంచార్జి ఎంపీపీ నడకుదుటి జననీకుమారి, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, ఎంపీడీఓ జే. స్వర్ణభారతి, ఏఎస్డబ్ల్యూఓ పర్వీన్ సుల్తానా, ఎంఈఓలు శివశంకర్, జీఎన్బీ గోపాల్, ప్రిన్సిపాల్ వీరరవి, ఏపీఓ టీవీఎన్ ముత్యాలు, ఉపాధ్యాయులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.