
మార్కాపురం: సమాజంలో హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులను మానవత్వంతో చూడాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి మార్కాపురం పట్టణంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ బారినపడి మృతి చెందిన వారిని స్మరించుకోవడం, బాధితులకు భరోసా కల్పిస్తూ అండగా నిలవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
డిసెంబర్ నాటికి వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత ఏడాది కాలంలో 228 హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఇన్చార్జ్ డీఎంహెచ్వో కే. రాహుల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.