
అమరావతి: గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజనుల భూ రక్షణ కోసం అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. గిరిజనులను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ 1/70 చట్టాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, గిరిజనులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వారి భూములకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని ప్రతిపక్షానికి సూచించారు.
వైసీపీ నాయకులు గత పాలనను గుర్తు చేసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పడం చిన్నపిల్లలు మారాం చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఆరోపించారు. ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతో పాటు గిరిజనుల కోసం అమలవుతున్న 18 పథకాలను నిలిపివేశారని విమర్శించారు.
జీవో నెం.3 విషయంలోనూ వైసీపీ ప్రభుత్వ వైఖరిని మంత్రి ప్రశ్నించారు. జీవో నెం.3 రద్దైన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని అన్నారు. గిరిజనుల విద్యా, ఉద్యోగ హక్కులకు సంబంధించిన అంశాల్లో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు మరచిపోలేదన్నారు.
జీవో నెం.3, డీఎస్సీ తదితర గిరిజన సమస్యలపై వైసీపీ ఆలస్యంగా స్పందిస్తోందని మంత్రి విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ముందుండాల్సిన ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు.
గిరిజనుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని గిరిజనులను కోరారు.