మున్సిపాలిటీ విద్యుత్ వ్యయం తగ్గించేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు

అమలాపురం: మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాలు తదితర సేవలకు వినియోగిస్తున్న విద్యుత్‌పై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుండగా, విద్యుత్ చార్జీలకు నెలకు సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ భారాన్ని తగ్గించేందుకు మొత్తం 1 మెగావాట్ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టును రెండు దశల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తొలి దశలో నడిపూడి రా వాటర్ వర్క్స్ వద్ద 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం, అంటే సుమారు రూ.3.60 కోట్లను బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకునే ప్రతిపాదనపై కలెక్టర్ సమీక్షించారు.

రుణంపై వడ్డీ రేటు, కాలపరిమితి, నెలవారీ చెల్లింపులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి మున్సిపాలిటీకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రెండో దశలో ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ ఆస్తులపై మరో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసి మొత్తం 1 మెగావాట్ సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో గుర్తించిన సుమారు 1,700 చదరపు మీటర్ల రూఫ్‌టాప్ ప్రాంతంలో 516 కిలోవాట్ల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు వ్యయం, విద్యుత్ ఉత్పత్తి, పొదుపు, నిర్వహణ వ్యయం, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలను డీపీఆర్‌లో సమగ్రంగా పొందుపరచాలని సూచించారు.

విద్యుత్ శాఖ, డిస్కం, ఏపీ ఈఆర్‌సీ నిబంధనలతో పాటు సాంకేతిక, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా దీర్ఘకాలికంగా మున్సిపాలిటీ విద్యుత్ వ్యయాన్ని తగ్గించి, ప్రభుత్వ భవనాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేలా ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కె. రాంబాబు, సోలార్ ఆస్ట్రిచ్ సీఈఓ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎం కె. పృథ్వీరాజ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బి. పవన్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.