
నెల్లూరు: ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి ఆశయాలకు అండగా నిలిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న “పల్లె వీక్షణ” కార్యక్రమం మరోసారి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మహిళా వ్యాపారవేత్త ఎద్దుల కళ్యాణికి రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ జంగాలకండ్రిగ గ్రామానికి చెందిన ఎద్దుల కళ్యాణికి కలెక్టర్ చెక్కును అందజేశారు.
2026 జూన్ 19న పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా జంగాలకండ్రిగ గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, భ్రమరాంబిక సంఘ సభ్యురాలైన ఎద్దుల కళ్యాణి నిర్వహిస్తున్న కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల నుంచి పశువుల పేడను కొనుగోలు చేసి, దానిని కంపోస్ట్‌గా మార్చి, వేపపిండిని కలిపి నాణ్యమైన ఎరువును రైతులకు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే అరటి, మామిడి పండ్ల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్న కళ్యాణి కృషిని కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా కళ్యాణి, ఆమె భర్త తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వేపకాయల పొడి తయారీ యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందుకు రూ.80 వేల ఆర్థిక సహాయం అవసరమని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తన సొంత నిధుల నుంచి రూ.80 వేల సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కళ్యాణికి రూ.80 వేల చెక్కును అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ప్రతిభను, చిన్నతరహా వ్యాపారాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారతకు మరింత ఊతం ఇవ్వవచ్చని ఈ కార్యక్రమం నిరూపించింది.
ఆర్థిక సహాయం అందుకోవడం పట్ల కళ్యాణి సంతోషం వ్యక్తం చేస్తూ, తన సమస్యను విని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి పాల్గొన్నారు.