
గుంటూరులో నిర్వహించిన తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతిభావంతుల విద్యార్థుల పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి పాల్గొని పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, అలాగే కూచిపూడి మరియు భరతనాట్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడుతూ, సామాజిక వర్గంలో వెనకబాటుతనం కారణంగా అనేక మంది అభివృద్ధికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విద్యార్థులు ఆర్థికంగా బలోపేతం కావడానికి కార్పొరేషన్ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకోట ప్రసాద్, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆబోతుల రామారావు, నగర జనరల్ సెక్రటరీ వంజీరపు దేవిశ్రీప్రసాద్, జిల్లా నాయకులు రేజేటి రామకృష్ణ, బలగా తిరుపతిరావు, దన్నాని శ్రీనివాసరావు, వంజీరపు రత్నకుమారి, కొత్తకోటి నాని, కొత్తకోట ఉమాలక్ష్మి, రేజేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.