

- ప్రచారంలో మేటి – పురోగతిలో సాటి.. జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటక వెలుగులు!
- రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంస్కరణల బాటలో టూరిజం.. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనం!
- సీఎం చంద్రబాబు విజన్ – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం – పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కార్యాచరణతో గడిచిన 22 నెలల్లో రూ. 20,088 కోట్ల పెట్టుబడులు, 117 ప్రాజెక్టులకు ఎంఓయూలు
- పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా.. 1.22 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు..నూతన పర్యాటక పాలసీ 2024-29తో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆసక్తి..
- కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యధికంగా రూ. 428 కోట్ల నిధుల సాధన..8 పర్యాటక ప్రాజెక్టులతో పర్యాటకాంధ్రప్రదేశ్ దిశగా ఏపీ అడుగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాచరణతో గత 22 నెలల్లో రాష్ట్ర పర్యాటక రంగం గణనీయమైన పురోగతి సాధించింది.
2024–26 మధ్యకాలంలో రూ.20,088 కోట్ల పెట్టుబడులతో 117 పర్యాటక ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా 1,22,637 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తాజ్, మారియట్, ఐటీసీ, హయత్, హిల్టన్ వంటి అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూరిజం పాలసీ 2024–29, పరిశ్రమ హోదా, టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ వంటి నిర్ణయాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. క్యాపిటల్ సబ్సిడీలు, ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలతో పెట్టుబడులకు మార్గం సుగమమైంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యలంక బీచ్, గండికోట, బొర్రా గుహలు, సింహాచలం, అన్నవరం వంటి పర్యాటక ప్రాజెక్టులకు రూ.428 కోట్ల నిధులు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 యాంకర్ హబ్‌లు, 25కు పైగా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
కార్డెలియా క్రూయిజ్‌లు, హెలీ టూరిజం, హౌస్ బోట్లు, క్యారవాన్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, హోమ్ స్టేలు వంటి కొత్త పర్యాటక అంశాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 1,855 హోమ్ స్టేలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఏపీ హోమ్ స్టే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విజయవాడ ఉత్సవ్, విశాఖ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, యోగాంధ్ర వంటి ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక ప్రచారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రచారాల ద్వారా లక్షలాది మంది నెటిజన్లను ఆకర్షించారు.
కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య 10.10 శాతం పెరగగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 126.87 శాతం వృద్ధి చెందింది. హోటల్స్, ట్రావెల్స్, గైడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
దక్షిణాదిలో అతి పెద్ద ట్రావెల్ ట్రేడ్ ఎక్స్‌పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026 సంస్థ ఆంధ్రప్రదేశ్‌ను “ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రం”గా ఎంపిక చేయడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. జూన్ 4న కేరళలో మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకోనున్నారు.