
మార్కాపురం: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం పుష్కర కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన విజయాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావుతో కలిసి గురువారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏలూరి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రాల సమగ్ర ప్రగతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23,500 కోట్లు కేటాయించిందని తెలిపారు.
వెనుకబడిన మార్కాపురం ప్రాంతంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జల జీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్టేట్ హైవేలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఉద్యానవన రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు ప్రతి పౌరుడికి చేరేలా బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూ.905 కోట్లు కేటాయించిందని, నిర్వాసితులకు త్వరలోనే పరిహారం అందించి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం రూ.13,175 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్లు, సంక్షేమ పథకాలు, జాతీయ రహదారులు, రాజధాని అభివృద్ధి తదితర అంశాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.14 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. రైల్వే, రహదారి మౌలిక సదుపాయాల విస్తరణతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమవుతోందని అన్నారు.
శ్రీశైలం వరకు రైల్వే ప్రాజెక్టు, జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం సహకారం అందిస్తోందని, అవసరమైన అటవీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మార్కాపురం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు అవకాశాలపై కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు ఏలూరి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి, నాయకులు మద్దెల లక్ష్మీదేవి, పువ్వాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.