
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్‌లో నిర్వహించిన విజయోత్సవ బహిరంగ సభలో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన, 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్, 58 శాతం ఓటు బ్యాంకుతో ఎన్డీఏ కూటమికి చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన, అభివృద్ధికి ఆటంకం కలిగించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి, నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి ఆశీర్వదించారని తెలిపారు.
ఈ విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం రాష్ట్ర ప్రగతికి మరింత బలాన్నిస్తోందని కొనియాడారు. ప్రపంచ నాయకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఆధ్వర్యంలోని శాఖల్లో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి మరో మూడు దశాబ్దాల పాటు ఐక్యంగా కొనసాగితే, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాల కంటే పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీయే కీలకమవుతుందని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం అందించే హరిత శక్తి రంగంలో కడప జిల్లా కీలక కేంద్రంగా ఎదగబోతోందని చెప్పారు. ప్రతి ఇంటిలో సౌరశక్తి వినియోగం పెరగడం ద్వారా ప్రత్యక్ష, పరోక్ష రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నిబద్ధతపై నమ్మకంతో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు.
ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకత, నీతి, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పాలన అందించగలిగేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని సుంకర శ్రీనివాస్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీస్సులు కొనసాగాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.