
అమలాపురం నియోజకవర్గం: అమలాపురంలో నిర్వహించిన ప్రత్యేక సభలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ బి. నాగ మానస విద్యార్థులను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం సాధించిన జడ్పీహెచ్ఎస్, సామంతకుర్రుకు చెందిన ఎస్. రిషిత లక్ష్మీ నిహారిక (596 మార్కులు) ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. అలాగే ద్వితీయ స్థానం సాధించిన జడ్పీహెచ్ఎస్, కాట్రేనికోనకు చెందిన ఎన్. కార్తీక, జి. హర్షిని సత్య దుర్గ (595 మార్కులు)లను కూడా అభినందించారు.
ఇదే సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 12 మంది విద్యార్థులను సన్మానించారు. వీరిలో సి.హెచ్. జ్యోతి, కె. అభి శ్రీ, వి. గాయత్రి, మోకా లాస్య, వి.కె. దేవి శ్రీ ప్రసాద్, కె. భవిత, జే. దిబోరా బ్లెస్సి, పి. దుర్గా లక్ష్మీ సాహితి, కె. లక్ష్మీ సాయి అమృత తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగ మానస మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా లేదా మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మరింత మంది విద్యార్థులు ప్రేరణ పొందాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి పి. నాగేశ్వరరావు, అలాగే విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను అభినందించారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేసిన వందరోజుల విద్యా ప్రణాళిక వల్ల తాము మంచి మార్గదర్శకత్వం పొందామని, అందువల్లే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్య తమ విజయానికి కారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట ఉప విద్యాశాఖ అధికారి కే. వెంకటేశ్వరరావు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి పి. నాగమణి, అమలాపురం సిడిపిఓ వై.కె.వి రమాదేవి పాల్గొన్నారు.