
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాకు మానవ జీవనశైలిని సానుకూలంగా మార్చే అపూర్వ శక్తి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. రోజువారీ యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చని తెలిపారు. శరీరం, మనస్సును ఏకీకృతం చేసే గొప్ప సాధనం యోగానేనని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 14 రోజుల పాటు యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించినట్లు వివరించారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం గంటపాటు యోగా అభ్యసించాలని సూచించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడిని కూడా అధిగమించవచ్చని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఐదు కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి యోగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం యోగాలో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి టి. మోహన్ రాజు, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, డీఎస్పీ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.