
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు.
ఈ సందర్భంగా యోగ మాస్టర్ మత్స. పుండరీకం మాట్లాడుతూ యోగ దృక్పథం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరమైన జీవన విధానాన్ని శ్రీకృష్ణ భగవానుడు బోధించారని పేర్కొన్నారు. సుఖదుఃఖాలు, గెలుపోటముల్లో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే యోగమని చెప్పారు. యోగా భారతీయ ప్రాచీన సంపదగా ప్రపంచానికి మన దేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య వరమని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది దివ్యౌషధమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నడుకూరు సచివాలయ కార్యదర్శి నల్ల శివ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిడి దూరమవుతాయని అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సచివాలయ హెల్త్ సిబ్బంది సుజాత, అనుష, లీల, రవణమ్మ, మహిళా పోలీసు హేమలత, వెటర్నరీ అసిస్టెంట్, స్థానిక నాయకులు, బీఎస్ఎఫ్ జవాన్ మత్స. వెంకటరమణ, కలిపిల్లి సింహచలం, చింతా గోవర్ధన్, ముంజేటి జగదీష్, సాధు సురేష్ తదితరులు పాల్గొన్నారు. భ్రమరి ప్రాణాయామం, గోముఖాసనం, సూర్య నమస్కారాలతో పాటు పలు యోగాసనాలను ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.