వల్లంపూడిలో జనసేనలో చేరిన 100 వైసీపీ కుటుంబాలు.. కూటమి విజయానికి కలిసి పనిచేయాలి: వబ్బిన సన్యాసి నాయుడు

ఎస్.కోట నియోజకవర్గంలోని వల్లంపూడి గ్రామంలో శనివారం రాత్రి మజ్జి శ్రీను ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ వబ్బిన సత్యనారాయణ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

పార్టీలో చేరిన వారిలో ఐదుగురు వార్డు సభ్యులు, ముగ్గురు పాలకేంద్రం అధ్యక్షులు, ఒక సాగునీటి సంఘం అధ్యక్షుడితో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ జనసేన కండువాలు కప్పి పార్టీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వల్లంపూడి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాసరావు (శ్రీను) పేరును పార్టీ నాయకులు ప్రకటించారు.

సభలో మాట్లాడిన నియోజకవర్గ సీనియర్ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా త్వరలోనే సాగునీరు అందుబాటులోకి వస్తుందని, వచ్చే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, పెందుర్తి–బొడ్డవర నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో పాటు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

వల్లంపూడి గ్రామ సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్న ఆయన, రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి మజ్జి శ్రీనును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వేపాడ మండల పార్టీ అధ్యక్షుడు సుంకర అప్పారావు, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షుడు గోరపల్లి రవి కుమార్, నాయకులు జొన్నపల్లె సత్తిబాబు, కోలా కన్నయ్యదొర, ఈశ్వరరావు, వావిలపాడు బుజ్జి, వర్మ, ముమ్మన దేవా, జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.