
విజయవాడ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నాని తమ నాయకుడిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చినప్పుడు అక్కడికి వెళ్లారని, మచిలీపట్నంలో ఇళ్లు కూల్చినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. గతంలో తమ పార్టీ పరిస్థితి వేరని, ప్రస్తుతం మచిలీపట్నంలో జనసేన ఎంపీ ఉన్నారని గుర్తు చేశారు.
తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి నివాసం కోసం అనేక ఇళ్లు కూల్చివేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడటమే చేశారని ఆరోపించారు.
ప్రతి రోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం ఘటనపై ఎంపీ బాలశౌరి కూడా మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే తాము అదే చేస్తామని, పేర్ని నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మచిలీపట్నం నియోజకవర్గం గత 30 ఏళ్లుగా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని విమర్శించారు.
వైసీపీ పాలనలో మహిళలపై కేసులు పెట్టడం, జనసైనికులు, వీర మహిళలపై దాడులు చేయించడం జరిగిందన్నారు. మెగాస్టార్ చిరంజీవిని జగన్ మోహన్ రెడ్డి అవమానించినప్పుడు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని దూషించినప్పుడు పేర్ని నాని ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి టికెట్ వచ్చినా గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా-పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, ఏపీ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, జనసేన నాయకులు హరిప్రసాద్, వేముల వెంకటేష్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.