పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి వర్మ తొలగింపు

పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న వివాదాలపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది. 2024 ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో నెలకొంటున్న పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి పార్టీ స్థాయిలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. కొత్త కమిటీ ద్వారా నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచి, పార్టీని మరింత బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. త్వరలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

గత కొంతకాలంగా ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ వర్గానికి, జనసేన క్యాడర్‌కు మధ్య తరచుగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, కూటమి పొత్తు ధర్మం దెబ్బతినకుండా టీడీపీ అధిష్ఠానం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.