విజయ్‌‌ని సీఎం కాకుండా అడ్డుకోవడం ప్రజా తీర్పుకు అవమానం: కమల్ హాసన్

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కమల్ హాసన్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. “తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. ప్రజా తీర్పును గౌరవిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని ఎంకే స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

అలాగే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ విధులను నిర్వర్తించాలని సూచిస్తూ, “ఇది డిమాండ్ కాదు.. వారి రాజ్యాంగ బాధ్యతను గుర్తుచేయడం మాత్రమే” అని తెలిపారు.

విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడంపై కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “108 స్థానాలు గెలిచిన పార్టీని ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే. ఎన్నికైన సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానం, ప్రజాస్వామ్యానికి నష్టం” అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్.ఆర్. బొమ్మై కేసు తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. “మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలోనే నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేను పార్టీ రాజకీయాల గురించి కాదు, ఒక భారతీయ పౌరుడిగా విధానపరమైన అంశంపై మాట్లాడుతున్నాను. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలి” అని కమల్ హాసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.