చింతలమోరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై సమీక్ష: పునరుద్ధరణకు చర్యలు

రాజోలు: మలికిపురం మండలం, చింతలమోరి ప్రాంతంలో రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించి ప్రయోజనకరంగా మార్చే దిశగా శాసన సభ్యులు దేవ వరప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్సీ రైతుల ప్రయోజనాల కోసం రూ.30 కోట్ల వ్యయంతో 3000 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించిన ఈ పథకం ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉపయోగంలో లేకపోవడం వల్ల రైతులకు ప్రయోజనం అందడం లేదన్నారు. అందువల్ల ఈ పథకాన్ని పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడే విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కేశనపల్లి స్కీమ్ ద్వారా కాలువ నుంచి నీటిని తీసుకువచ్చే అవకాశాలను అధికారులు సాంకేతికంగా పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారో, ఇంకా ఎవరెవరికి ప్రయోజనం కల్పించవచ్చో పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు.

అవసరమైతే పైప్‌లైన్ల ద్వారా నీటిని పంపిణీ చేసి మరింత మంది రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. వర్షాకాలంలో కొన్ని గ్రామాల్లో ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండే సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చోట లిఫ్ట్ సదుపాయాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్షలో నీటి సంఘం చైర్మన్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, డ్రైనేజ్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.