
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా స్థాయి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత పాల్గొన్నారు.
వందలాది మంది ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరైన ఈ సభలో ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, భారీ పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక ప్రగతి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
ఈ విజయోత్సవ సభలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్ర పురోగతికి మరింత కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.