సోలార్ ప్లాంట్, టిడ్కో సమస్యల పరిష్కారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

అమలాపురంలో 500 కేవీ సోలార్ ప్లాంట్‌కు వేగవంతమైన చర్యలు.. జూన్ 24న బోడసకుర్రు టిడ్కో గృహాల పరిశీలన: కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ అవసరాలను శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో తొలి దశలో 500 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్, మున్సిపల్, బ్యాంకు అధికారులతో కలిసి సోలార్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

అమలాపురం మున్సిపాలిటీ అవసరాల కోసం సుమారు రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్టుగా 500 కేవీ సోలార్ ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నడిపూడి వద్ద ఇప్పటికే రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు వెల్లడించారు.

సోలార్ ప్లాంట్ నిర్మాణంలో ఆర్థిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కలెక్టర్, ప్రస్తుతం మున్సిపాలిటీ చెల్లిస్తున్న విద్యుత్ బిల్లుల పరిధిలోనే బ్యాంకు రుణాల ఈఎంఐలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. దీనివల్ల పురపాలక సంఘంపై అదనపు ఆర్థిక భారం పడదని పేర్కొన్నారు.

ప్లాంట్ నిర్మాణ వ్యయం, బ్యాంకు రుణాలు, వడ్డీ రేట్లపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే తరహాలో బండారులంక గ్రామపంచాయతీలో కూడా విద్యుత్ వినియోగం, నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని సమతుల్య బడ్జెట్‌తో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

ఈ సందర్భంగా బోడసకుర్రు శివారు దేవర్లంక టిడ్కో గృహ సముదాయాల్లో నెలకొన్న సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించారు. కాలనీలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఎస్‌టీపీ అవుట్‌లెట్ నిర్మాణం, తాగునీటి సరఫరా కోసం మైక్రో ఫిల్టర్ల ఏర్పాటు, మురికినీటి సేకరణ ట్యాంకు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. డ్రైనేజీ పైప్‌లైన్‌ను ప్రధాన కాలువకు అనుసంధానం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.

కాలనీలో వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేసిన కలెక్టర్, బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయాలను ఈ నెల 24వ తేదీన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తానని వెల్లడించారు.

ఈ సమావేశంలో టిడ్కో డివిజనల్ ఇంజనీర్ సురేంద్ర, ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్, ఎల్‌డీఎం కేశవ వర్మ, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ పి.ఎస్. నవీన్ కుమార్, నెడ్‌క్యాప్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.