
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన పోస్టులు, వీడియోలు, కథనాలను తక్షణమే తొలగించాలని లేదా నిలిపివేయాలని బెంగళూరు న్యాయస్థానం ఎక్స్, గూగుల్, మెటా వంటి సామాజిక మాధ్యమ వేదికలను ఆదేశించింది.
తెలంగాణలోని కోడి చెరువు భూ వివాదానికి సంబంధించి తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నిలువరించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషన్‌లో పేర్కొన్న నిర్దిష్ట యూఆర్‌ఎల్‌లతో పాటు, అజ్ఞాత ఖాతాల నుంచి భవిష్యత్తులో వచ్చే ఇదే తరహా పోస్టులు, కంటెంట్‌పైనా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ కోర్టు ‘జాన్ డో’ ఉత్తర్వులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని కోడి చెరువు భూములను పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని, భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ మే చివరి వారంనుంచి జూన్ తొలి వారం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలను ఖండించిన పవన్ కళ్యాణ్ న్యాయపరంగా పోరాటం ప్రారంభించారు.
బుధవారం కేసును విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించింది. ఈ ఆదేశాలతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వివాదాస్పద కంటెంట్‌పై చర్యలకు మార్గం సుగమమైంది.