
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ విడుదల చేశారు. నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న ‘అవని’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ పోస్టర్ను పంచుకుంటూ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘అవని’ పాత్రలో ఆమె నటన ఆకట్టుకునేలా ఉండబోతోందని పేర్కొంది. పోస్టర్లో త్రిష సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తున్నారు.
భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్ ఆధారంగా ఉంటుందని చిరంజీవి ఇప్పటికే వెల్లడించారు. పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకునే చందమామ కథలా సినిమా ఉండబోతుందని చెప్పారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.