ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. ప్రభుత్వ చొరవతో స్వదేశానికి రాక

ఉపాధి కోసం ఒమన్ వెళ్లి అక్కడ యజమాని వేధింపులకు గురై నిర్బంధంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తోంది. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన దుదేకుల షెహనాజ్, ప్రభుత్వ జోక్యంతో ఈ నెల 7న తిరిగి ఇంటికి చేరుకోనున్నారు.

గత నవంబర్‌లో ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన షెహనాజ్, అక్కడి పని నచ్చక తిరిగి రావాలనుకున్నారు. అయితే యజమాని ఆమెను అనుమతించకుండా నిర్బంధించి, ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న షెహనాజ్, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు.

ఈ వీడియోను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి, ఆమెను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం అధికారులు షెహనాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఒమన్‌లోని ఏజెంట్లు, భారత విదేశాంగ శాఖ, మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు ప్రారంభించారు.

ఇక షెహనాజ్ భర్త ఏపీఎన్ఆర్‌టీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. మొదట ఏజెంట్ రూ.2 లక్షలు డిమాండ్ చేసినప్పటికీ, స్థానిక పోలీసుల జోక్యంతో చర్చలు జరగడంతో, చివరికి ఏజెంట్ తన ఖర్చులతోనే ఆమెను స్వదేశానికి పంపేందుకు అంగీకరించాడు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, వలస కార్మికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షెహనాజ్‌ను సురక్షితంగా రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఏపీఎన్ఆర్‌టీఎస్ అధికారులను ఆయన అభినందించారు.

Share this article

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.