శ్రీ పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం

రూ.55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం
• పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి
• శిథిలావస్థకు చేరిన ఆలయ పునరుద్ధరణకు హామీ
• పర్యటన ముగిసిన వెంటనే టీటీడీకీ లేఖ… స్పందించిన పాలక మండలి
• శివాలయంతోపాటు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలోని శివాలయం పునరుద్ధరణకు టీటీడీ నిధులు మంజూరు చేసింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విన్నపం మేరకు రూ. 55 లక్షల నిధులు మంజూరు చేస్తూ టీటీడీ పాలక మండలి ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 14వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు ప్రాంత పర్యటనలో భాగంగా వర్తనపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు పరిశీలిస్తున్న సమయంలో శివాలయాన్ని సందర్శించాలని స్థానికులు కోరారు. భక్తుల కోరిక మేరకు స్వామి వారి దర్శనానికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శివాలయం శిథిలావస్థకు చేరడాన్ని గమనించారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని ఆ గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రివర్యులను కోరారు. టీటీడీ సహకారంతో శివాలయం అభివృద్ధికి అవసరం అయిన చర్యలు చేపడతామని వర్తనపల్లి వాసులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన వెంటనే వర్తనపల్లి శివాలయం నిర్మాణం కోసం టీటీడీకి లేఖ రాశారు. ఆ ప్రాంత భక్తుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. తక్షణం టీటీడీ సాంకేతిక బృందం వర్తనపల్లిలో పర్యటించింది. గ్రామస్తుల అభిమతం మేరకు శివాలయం పునర్నిర్మాణంతోపాటు సింహవాహనంతో కూడిన అమ్మవారి విగ్రహం, మూషిక వాహనంతో కూడిన గణపతి విగ్రహం, నెమలి వాహనంతో కూడిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం, ధ్వజస్తంభం ఏర్పాటుకు అంచనాలు రూపొందించింది. వీటితోపాటు భక్తులు సేదతీరేందుకు బెంచీలు, బోర్ వెల్ తో కూడిన తాగునీటి సౌకర్యం, మైక్ సిస్టం తదితర సౌకర్యాలు కూడా వర్తనపల్లి శివాలయంలో ఏర్పాటు చేసేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆలయ పునర్నిర్మాణం కోసం సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ పాలక మండలి ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకు, టీటీడీ అధికారులకి ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.