రైల్వే జోన్ ఇదిగో… ప్రయోజనాలు అవిగో!

 దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు
* రాష్ట్రాభివృద్ధికి ఊతం
* నెరవేరిన దశాబ్దాల కల
* ప్రకటించిన కేంద్రం
* నాడు మోకాలడ్డిన వైకాపా సర్కారు
* నేడు కూటమి ప్రభుత్వం సానుకూల కృషి

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1, 2026 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించనుందనే ప్రకటన రాష్ట్ర ప్రజలందరికీ శుభ వార్తే. ఆంధ్రప్రదేశ్ దశాబ్దాల కల అయిన ఈ జోన్ ఏర్పాటు వల్ల అనేక కీలక ప్రయోజనాలు సమకూరనున్నాయి. అవేంటో చూద్దాం.
1. మౌలిక సదుపాయాలు… పాలనా సామర్థ్యం
• సమీకృత నిర్వహణ: విజయవాడ, గుంటూరు, గుంతకల్లు కొత్తగా ఏర్పడిన విశాఖపట్నం డివిజన్లు ఒకే జోన్ పరిధిలోకి వస్తాయి. దీనివల్ల వివిధ ప్రాజెక్టుల నిర్ణయాలు, రైల్వే లైన్ల విస్తరణ, ఆధునీకరణ పనులు వేగవంతం అవుతాయి.
• ఆదాయ వినియోగం: ఈ జోన్ పరిధిలోని డివిజన్లు దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ ఆదాయాన్ని రాష్ట్రంలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి నేరుగా ఖర్చు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
2. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
• కొత్త రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు: విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఆర్‌ఆర్‌బీ, ఆర్ ఆర్ సీ ఏర్పడతాయి. వీటి వల్ల స్థానిక యువతకు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది.
• అదనపు ఉపాధి: కొత్త జోన్ కార్యాలయాలు, కోచింగ్ డిపోలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల సుమారు 17,000 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
3. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
• రైళ్ల అందుబాటు: రాజధాని, శతాబ్ది, జన శతాబ్ది, హంసఫర్ వంటి ప్రీమియం రైళ్లు రాష్ట్రం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
• సబర్బన్ రైలు వ్యవస్థ: విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో హైదరాబాద్ MMTS తరహా సబర్బన్ రైలు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి మార్గం సుగమమవుతుంది.
4. పారిశ్రామిక, లాజిస్టిక్స్ వృద్ధి
• ఓడరేవుల అనుసంధానం: విశాఖపట్నం, కృష్ణపట్నం, రాబోయే బందర్ (మచిలీపట్నం) ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడుతుంది.
• రవాణా వేగం: వ్యవసాయ, మత్స్య, పారిశ్రామిక ఉత్పత్తులకు రవాణా ఖర్చులు తగ్గి, సరుకు రవాణా సమయం ఆదా అవుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుంది.
స్థూలంగా వీటిని చెప్పుకున్నా మరిన్ని ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు చేకూరడంతో పాటు, తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి సైతం పరుగులు పెడుతుంది. భూముల విలువ పెరగడం, అనుబంధ పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య, ఉపాధి అవకాశాలు చేకూరడం లాంటివి ఎన్నో ఉంటాయి.
* పూర్వాపరాలు ఇవీ….
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం, జూన్‌ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటించడంతో… రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీకి కార్యరూపం జరిగింది.
ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్‌తో కలిపి మొత్తం నాలుగు డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్‌ పని చేయనుంది. ఈ మేరకు రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని షెడ్యూల్‌ 13(8)లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్లైంది. ‘ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుపై రైల్వే శాఖ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆరు నెలల్లోపు పరిశీలించి, వేగంగా నిర్ణయం తీసుకుంటుంది’ అని విభజన చట్టంలో ఇచ్చిన హామీ… 12 ఏళ్ల తర్వాత సాకారమవుతోంది. 2024లో కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే అధికారం చేపట్టిన రెండేళ్లలోనే కొత్త జోనల్‌ ఏర్పాటు ప్రక్రియ సాకారమవడం విశేషం. దీని వెనుక కూటమి ప్రభుత్వం సానుకూల కృషి కూడా ఎంతో ఉంది. దీంతో భారతీయ రైల్వేలో మొత్తం జోన్ల సంఖ్య 18కి చేరనుంది.
* 12 ఏళ్లలో ఎన్నో పరిణామాలు…
విశాఖపట్నం రైల్వే జోన్‌ సాధన వెనుక సుదీర్ఘ పోరాటాలు, నిరంతర ప్రయత్నాలున్నాయి. 2014 నుంచి 2018 వరకు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెదేపా… రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అప్పట్లో కూటమి నుంచి వైదొలిగింది. ఆ తరుణంలోనే… ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 27న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రం తరఫున నాటి రైల్వే అధికారిక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనలో వాల్తేరు డివిజన్ ను రెండు భాగాలు చేస్తామనే ప్రతిపాదనకు వ్యతిరేకత ఎదురైంది.
కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు పేరుతో చారిత్రక నేపథ్యమున్న వాల్తేర్‌ డివిజన్‌ను చీల్చి, దాని మనుగడను ప్రశ్నార్థకం చేయడమేంటని ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్‌నాయుడితో పాటు పలువురు రైల్వే నిపుణులు కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం శ్రీ చంద్రబాబు దీనిపై దిల్లీకి లేఖలు రాశారు. దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. వాల్తేర్‌ డివిజన్‌లో 463 రూట్‌ కి.మీ. భాగాన్ని విజయవాడలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకొని, విశాఖ కేంద్రంగా కొనసాగించాలని నిర్ణయించింది. మిగతా 696 రూట్‌ కి.మీ. భాగాన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త రైల్వే డివిజన్‌లో కలిపింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఇప్పుడున్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులను కేంద్రం మార్చింది. దాని ప్రకారం కొత్త జోన్ల స్వరూపం ఇలా ఉంటుంది.
• దక్షిణ కోస్తా రైల్వే జోన్‌- విశాఖపట్నం: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి విడదీసిన గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌ను మార్చి ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్‌.
• తూర్పు కోస్తా రైల్వే జోన్‌- భువనేశ్వర్‌: ప్రస్తుత సంబల్‌పుర్‌ డివిజన్, సవరించిన ఖుర్దా రోడ్డు, రాయగడ డివిజన్లు.
• దక్షిణ మధ్య రైల్వే- సికింద్రాబాద్‌: ప్రస్తుత హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు, సవరించిన సికింద్రాబాద్‌ డివిజన్‌.
*డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వచ్చాకే..
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు వెనుక జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం…
• 2024 ఆగస్టులో ముడసర్లోవలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కోసం 52.2 ఎకరాల భూమి కేటాయింపు.
• 2024 అక్టోబర్‌లో సీఎం శ్రీ చంద్రబాబు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్‌నాయుడితో కలిసి దిల్లీలోని తన అధికార నివాసం 1-జన్‌పథ్‌లో రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని విజ్ఞప్తి.
• 2025 జనవరి 8న రూ.183.58 కోట్లతో తలపెట్టిన జోనల్‌ ప్రధాన కార్యాలయానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన.
• 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.55 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు. అందులో మార్చి నాటికి రూ.32.31 కోట్ల వ్యయం.
• జోన్‌ ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా ఉద్యోగుల గృహసముదాయం, ఇతర పనుల కోసం అదనంగా రూ.157.93 కోట్లు కేటాయింపు.
• కొత్త జోన్‌ కార్యాలయం అందుబాటులోకి వచ్చేవరకూ వీఎంఆర్‌డీఏ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాయలయం తాత్కాలికంగా ప్రారంభం. ఇందులో జనరల్‌ మేనేజర్, ఇతర సీనియర్‌ మేనేజర్ల నియామకం. కంట్రోల్‌ ఆఫీస్‌ ఏర్పాటు. కొత్త జోన్‌లో పని చేయడానికి నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ.
• రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదం: ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై రాష్ట్ర విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు. జూన్‌ 1 నుంచి విశాఖ కేంద్రంగా జోన్‌ అధికారిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వాల్తేరు డివిజన్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్ఛాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణారంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది”.
• రైల్వే నెట్‌వర్క్‌ మరింత బలోపేతం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కల్యాణ్‌
“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ గెజిట్‌ ప్రకటన చరిత్రాత్మక నిర్ణయం. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త అడుగు. రవాణా వ్యవస్థను వేగవంతం చేస్తుంది. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుంది. ప్రజలకు కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే ప్రకటన చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు. కొత్త రైల్వే జోన్‌ సాకారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తున్నా”.
* మన అవసరాల మేరకు లైన్లు.. రైళ్లు
ఇప్పటిదాకా రాష్ట్రంలో వివిధ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా రైళ్లను పూర్తిస్థాయిలో పెంచేందుకు అవకాశం లేకపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలు … భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లోను, మిగిలిన జిల్లాల్లో సింహభాగం సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోను ఉండేవి. దీంతో ప్రయాణికుల ప్రయోజనాల కంటే, జోన్‌ ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యమిచ్చేవారు. కొత్తగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ రావడంతో మన పరిధిలో రైళ్లను మనమే పెంచుకునే అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొత్తగా రైళ్లు నడుపుకోవచ్చు.
ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధి విశాఖపట్నం శివారు తాడి వరకు ఉంది. ఆ తర్వాత దువ్వాడ నుంచి ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో ఉండేది. దీంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పలు రైళ్లను విశాఖ వరకే నడిపేది. దక్షిణ మధ్య రైల్వే కూడా పండుగలు, సెలవుల సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను అనకాపల్లి వరకే నడుపుతోంది. విశాఖ, శ్రీకాకుళం రోడ్‌ వరకూ నడిపితే… రాబడి ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు వెళ్తుందన్న భావనతో అధికారులు ఉండేవారు. ఇకపై ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రోడ్, విశాఖపట్నం నుంచి… తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాలకు కొత్త రైళ్లు నడిపేందుకు వీలుంటుంది.
విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రెండు నగరాల మధ్య నడిచేలా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తెస్తే… కొంతకాలానికి దాన్ని విశాఖ నుంచి కాకుండా, భువనేశ్వర్‌ నుంచి మొదలయ్యేలా మార్చారు. దీనివల్ల వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్ల పరిధిలో బెర్తుల కోటా తగ్గిపోయింది.
గతంలో విశాఖపట్నం నుంచి పుట్టపర్తి మీదుగా బెంగళూరుకు నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను సైతం భువనేశ్వర్‌కు మార్పు చేశారు. ఇకపై ఇలాంటి అహేతుక మార్పులకు అడ్డుకట్ట వేయొచ్చు.
అలాగే గతంలో కోల్‌కతా కేంద్రంగా ఉండే సౌత్‌ ఈస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలో… విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్‌ ఉండేది. అప్పట్లో ఆగ్రా, బెనారస్, చక్రధర్‌పుర్, ఖరగ్‌పుర్, ఖుర్దారోడ్, నాగ్‌పుర్, వాల్తేరు డివిజన్లకు కలిపి కీలకమైన కన్‌స్ట్రక్షన్‌ విభాగం ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉండేది. తర్వాత భువనేశ్వర్‌ కేంద్రంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పడినప్పుడు విశాఖలోని కన్‌స్ట్రక్షన్‌ విభాగాన్ని, అక్కడి అధికారులను భువనేశ్వర్‌కు తరలించారు. దీంతో విశాఖ కేంద్రంగా జోన్‌ ప్రకటించాలన్న డిమాండ్‌ అప్పట్లోనే పురుడుపోసుకుంది.

• చేతులెత్తేసిన వైకాపా సర్కారు
కొత్త జోనల్‌ కార్యాలయాలు, ఇతర భవనాల నిర్మాణానికి 2020-21లో కేంద్ర బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించారు. ముడసర్లోవలో రైల్వేకి చెందిన 53 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఫిబ్రవరిలో జోన్‌ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేశాక… అదే ఏడాది రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చింది. రైల్వే అధికారులు భూముల స్వాధీనానికి ప్రయత్నించగా, రైతులు అడ్డుకున్నారు. దీనిపై శ్రీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూములు అప్పగించనందునే… జోన్‌ పనుల్లో జాప్యమవుతోందని 2024 ఫిబ్రవరి 1న లోక్‌సభలో రైల్వేమంత్రి ప్రకటించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, 53 ఎకరాలు రైల్వే శాఖకు అప్పగించడంతో జోనల్‌ కార్యాలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
• ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ షురూ…
విశాఖలోని వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో జోనల్‌ కార్యాలయానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయగా, అందులో సిబ్బంది 3 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూన్‌ నుంచి ఇది పూర్తిస్థాయిలో తాత్కాలిక జోనల్‌ కార్యాలయం కానుంది. ఈ కార్యాలయానికి 128 మంది అధికారులు, 1,100 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. సౌత్‌ సెంట్రల్, ఈస్ట్‌ కోస్ట్, సదరన్, సెంట్రల్‌ రైల్వే జోన్లలో పనిచేస్తున్న ఏపీ.. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యోగులు 3,700 మంది విశాఖకు వస్తామంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,100 మందిని ఎంపికచేసే ప్రక్రియ ఈనెల 20కి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.