మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాకముందే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మహానాడు వేదికగా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదివారం ఆయన కార్యాలయంలో “థాంక్యూ సీఎం – థాంక్యూ లోకేష్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుష్మిత, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళలే పూర్తిస్థాయిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాన్ని మహిళల ఆధ్వర్యంలో నిర్వహించారు.

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తదితరులు వెనుక వరుసలో కూర్చొని మహిళల ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమాన్ని వీక్షించడం విశేషంగా నిలిచింది.

అలాగే ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, నాయకులు నిమ్మకాయల రంగనాగ్, కటకం శెట్టి బాబి, పెంకె శ్రీనివాస్ బాబా, ఏటుకూరి నాగమణి, సీతామహాలక్ష్మి, రామలక్ష్మి తదితర మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమం అనంతరం సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మహిళలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.