
తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అనేక సందర్భాల్లో పేర్కొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై కొందరు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి తెలిపారు.
విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని అన్నారు. అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఎదుగుదలను ఓర్వలేక కొందరు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ అనేక సభల్లో తెలంగాణ ఉద్యమం తనకు స్ఫూర్తినిచ్చిందని, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని గౌరవిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు ఆయన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తెలంగాణ ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదని అన్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్నలు అడిగితే దానిని వివాదాస్పదంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని రమాదేవి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేసి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రజలకు బాగా తెలుసని, ప్రజలే నిజానిజాలను గుర్తించి ఇటువంటి దుష్ప్రచారాలను తిప్పికొడతారని ఆమె పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని సూచించారు.