ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: ప్రకాశం ఎస్పీ

ఒంగోలు : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., అధికారులను ఆదేశించారు.

సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)’ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచి మొత్తం 90 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి ఫిర్యాదిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సివిల్, భూ, ఆర్థిక వివాదాలు, మోసాలు, ఉద్యోగ మోసాలు, అత్తింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, చట్టపరంగా త్వరితగతిన న్యాయం అందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫిర్యాదుల వివరాలను పంపించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, వాటిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

పోలీసు కార్యాలయాలకు వచ్చే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారితో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుగా విని సత్వర పరిష్కారంపై నమ్మకం కల్పించాలని ఎస్పీ సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయానికి రావడం సాధ్యం కాని వారు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్‌డివిజన్ కార్యాలయాల్లో కూడా సమర్పించవచ్చని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్, ఒంగోలు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ రమేష్, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానెల్ అడ్వొకేట్ బి. బాలాజీ సింగ్, ఎస్సై యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.