ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో ఎస్కేయూ విద్యార్థి ప్రతిభ

అనంతపురం: దేశవ్యాప్తంగా నిర్వహించిన 21వ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (AIBE)లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) న్యాయ విద్యార్థి ఎల్లార్తి చంద్రశేఖర్ అర్హత సాధించారు.

ఇటీవల విడుదలైన ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,75,701 మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో 1,15,805 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,595 మంది పరీక్ష రాయగా, 962 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈ పోటీ పరీక్షలో విజయం సాధించడం పట్ల చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో సమర్థవంతమైన న్యాయవాదిగా సేవలందిస్తూ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అన్యాయం జరిగిన ప్రతి చోట న్యాయం కోసం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

చంద్రశేఖర్ విజయం సందర్భంగా ఎస్కేయూ న్యాయ విద్యార్థులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి న్యాయవృత్తిలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అధ్యాపకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎస్కేయూ న్యాయ విద్యార్థి, డోన్ అసెంబ్లీ బీజేపీ నాయకుడు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ, జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధించిన ఎల్లార్తి చంద్రశేఖర్ ఇతర న్యాయ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయసేవలు అందిస్తూ రాజ్యాంగ విలువలను పరిరక్షించే న్యాయవాదిగా ఎదగాలని ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.