
ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో 74 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను స్వయంగా స్వీకరించిన ఎస్పీ, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి చట్టపరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదుల వివరాలు అందజేసి తక్షణ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు.
వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారు కూడా ఫిర్యాదు చేసేందుకు వస్తారని గుర్తుచేసిన ఎస్పీ, అటువంటి వారికి మర్యాదపూర్వకంగా స్పందించి వారి సమస్యలను శ్రద్ధగా విని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. అవసరమైతే సంఘటన స్థలాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్, సబ్-డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలు వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.