కైకలూరులో జనసేన చర్చా వేదిక.. నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

కైకలూరు: కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌కు ముదినేపల్లిలో మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ముదినేపల్లి నుంచి భారీ ర్యాలీగా కైకలూరుకు చేరుకుని చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు, పార్టీ శ్రేణులందరికీ మోటేపల్లి ఆంజనేయ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో జనసేన నాయకుడు హనుమాన్ ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వారికి ఎదురవుతున్న సవాళ్లను ప్రత్యక్షంగా వినేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చొరవతో ‘జనసేన చర్చా వేదిక’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తొలి నియోజకవర్గంగా కైకలూరును ఎంపిక చేయడం విశేషమన్నారు.

పార్టీ నాయకులే కార్యకర్తల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడం దేశ రాజకీయాల్లో వినూత్న కార్యక్రమమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.

సమావేశంలో కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు సూచనలు చేయగా, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసే అంశాలపై చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు, పార్టీ నాయకులు, వీర మహిళలు, యువత, అభిమానులు హాజరయ్యారు. సభా ప్రాంగణం జనసేన నినాదాలతో మార్మోగగా, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.