
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అధ్యక్షతన ఐదో బోర్డు సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో సంస్థ అభివృద్ధి, పరిపాలన, ఆర్థిక నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులు చర్చించి, అజెండాలోని ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సమావేశంలో ఐడీసీ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించే అవకాశాలపై విస్తృతంగా వివరించారు.
కరవు ప్రభావిత అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఐడీసీ బడ్జెట్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు తగిన కేటాయింపులు చేసి, సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని బోర్డును కోరారు.
సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, డిప్యూటీ సెక్రటరీ భారతి, ఐడీసీ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.