
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న **”లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్పో 2026″**ను విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన హస్తకళాకారులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందు ఉప ముఖ్యమంత్రి ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన హస్తకళా స్టాళ్లను సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. కొండపల్లి బొమ్మలు, కలంకారి, ఎటికొప్పాక బొమ్మలు, ఉప్పాడ చేనేత, మంగళగిరి వస్త్రాలు, వెదురు, చెక్క, లోహం, రాతి, తాటి ఉత్పత్తులను పరిశీలించి కళాకారుల ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళలు కేవలం వస్తువులు కాదని, మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. హస్తకళాకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని, వారి జీవన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన అవసరాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సేవలు, బీమా, సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కళాకారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కళాకారుల ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, లేపాక్షి బ్రాండ్‌ను ప్రపంచస్థాయిలో మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. యువత సంప్రదాయ హస్తకళల వైపు ఆకర్షితులయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. స్వదేశీ హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రి సవితమ్మ మాట్లాడుతూ హస్తకళలు, చేనేత రంగాలు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఎక్స్పో కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర హస్తకళా రంగం కొత్త దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల ప్రకటించిన 30 జాతీయ హస్తకళా అవార్డుల్లో 10 అవార్డులు ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు రావడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. లేపాక్షి బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, హస్తకళాకారుల ఆదాయాన్ని పెంచడం, యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, హస్తకళా సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన హస్తకళాకారులు, కళాభిమానులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.