ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు చేయాలి: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం : రైతులకు అవసరమైన ఎరువులను గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు స్పష్టం చేశారు.

స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతులకు అవసరమైన మేరకే ఎరువులు సరఫరా చేయాలని, ప్రతి విక్రయానికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని డీలర్లకు ఆదేశించారు. యాప్ ఆధారిత విధానంలోనే ఎరువుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, నానో, జీవ, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెంపొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ ఇన్‌చార్జి అధికారి బాలాజీ నాయక్, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం వ్యవసాయ సహాయ సంచాలకులు రాజశ్రీ, జైనులాబ్దీన్, వెంకటరమణతో పాటు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.